పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు ఓటమి నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతుంది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 498 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది.
బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. యువ ఓపెనర్, విండీస్ దిగ్గజ బ్యాటర్ తనయుడు టగెనరైన్ చంద్రపాల్ (45) ఒక్కడు కాసేపు నిలకడగా ఆడగా.. షమ్రా బ్రూక్స్ (11), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (24) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బ్రాత్‌వైట్‌కు జతగా కైల్ మేయర్స్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు 306 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే ఆసీస్ గెలవాలంటే.. ఏడుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేస్తే సరిపోతుంది.
అంతకుముందు మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 182/2 (37 ఓవర్లు) స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (6) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా, వార్నర్ (48) పర్వాలేదనిపించాడు. స్టీవ్ స్మిత్ (20) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో.. ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన విండీస్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌటైంది. స్టార్క్ (3/51), కమిన్స్ (3/34) విండీస్ పతనాన్ని శాసించారు.
Comments
Please login to add a commentAdd a comment