
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌కు ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ చుక్కలు చూపించారు. పెర్త్ వేదికగా నిన్న (నవంబర్ 30) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో లబూషేన్ ద్విశతకంతో (204), స్మిత్ అజేయమైన భారీ శతకంతో (189*) చెలరేగి విండీస్ బౌలర్లతో ఆటాడుకున్నారు. మ్యాచ్ తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న లబూషేన్ రెండో రోజు (డిసెంబర్ 1) మరింత జోరు పెంచి కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
మరోవైపు 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88 టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు.
29 x 💯
— cricket.com.au (@cricketcomau) December 1, 2022
Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5
ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉండగా, సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు.
ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. లబూషేన్ ద్విశతకానికి తోడు స్మిత్ అజేయమైన భారీ శతకం, ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (65), ట్రవిస్ హెడ్ (80 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో 148 ఓవర్లలో 568/3 స్కోర్ వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment