పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో, ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. తన కెరీర్‌లో నాలుగో సారి ఈ ఫీట్‌ను నమోదు చేయగా, లబూషేన్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు.
ఈ క్రమంలో స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు.
ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు.
మరోవైపు ట్రవిస్ హెడ్.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన హెడ్.. పరుగు తేడాతో తన 5వ టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ద్వారా విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన టగెనరైన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment