ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59) గురువారం హఠాన్మరణం చెందాడు. ఐపీఎల్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నాడు. బుధవారం రాత్రి ముంబై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహిరించిన అతను చనిపోవడానికి ముందు కూడా స్టార్ స్పోర్ట్స్‌వారి ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. మధ్యాహ్న భోజనానికి ముందు తీవ్ర గుండెపోటు కారణంగా హోటల్ గదిలోనే మరణించినట్లు సమాచారం. లంచ్‌కు వెళ్లటం గురించి జోన్స్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో గదికి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం తెలిసింది.
బ్రెట్ లీ కొద్ది సేపు ‘సీపీఆర్’ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయినట్లు అర్థమైంది. ఆటగాడిగా క్రికెట్ గుడ్‌బై చెప్పిన తర్వాత జోన్స్ కోచ్‌గా, కామెంటేటర్‌గా మళ్లీ తన అనుబంధాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2015నుంచి 2019 వరకు ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు జోన్స్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా పలు ఘనతలు సాధించడంతో పాటు సునిశీత పరిశీలన, క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాలపై అతని విశ్లేషణలకు క్రికెట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే జోన్స్‌ను ‘ప్రొఫెసర్’ అని కూడా అతని సన్నిహితులు పిలుస్తారు. డీన్ జోన్స్ మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతని ఘనతలను ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు.
మద్రాస్ స్పెషల్
డీన్ జోన్స్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా నిలిచాడు. 1987 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర (314 పరుగులు) పోషించిన డీన్ జోన్స్ కెరీర్‌లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలురాయి. ఆసీస్ 4–0తో నెగ్గిన ఈ సిరీస్‌లో జోన్స్ 566 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్ ఊపందుకుంటున్న సమయంలో జోన్స్ అందరికన్నా ప్రత్యేకంగా నిలిచాడు. వేగవంతమైన బ్యాటింగ్ శైలి, మైదానంలో చురుకైన ఫీల్డింగ్ కలగలిపి అసలైన వన్డే క్రికెటర్‌గా ఎదిగాడు.
వికెట్ల మధ్య చురుకైన సింగిల్స్, వికెట్లకు అడ్డంగా వెళ్లి లెగ్‌సైడ్ వైపు షాట్లు ఆడటం, పేసర్ల బౌలింగ్‌లో కూడా క్రీజ్ వదలి ముందుకు దూసుకొచ్చి పరుగులు రాబట్టడం...టి20 క్రికెట్‌లో ఇప్పుడు చూస్తున్న ఇలాంటి శైలి ఆటను జోన్స్ 80వ, 90వ దశకాల్లోనే వన్డేల్లో చూపించాడు. నాటి రోజుల్లోనే అతను సుమారు 45 సగటుతో పరుగులు చేయడం విశేషం. అయితే జోన్స్ కెరీర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్ 1986లో మద్రాసులో భారత్‌తో జరిగిన చారిత్రాత్మక ‘టై’ టెస్టులో వచ్చింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య ఏకంగా 502 నిమిషాలు క్రీజ్‌లో నిలిచిన జోన్స్... 330 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 పరుగులు చేయడం అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆట ముగిసిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి జోన్స్‌కు సెలైన్లు ఎక్కించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment