పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ (42) సరసన నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును(41) అధిగమించాడు. తన కెరీర్‌లో మొత్తంగా 101 టీ20లు ఆడిన బాబర్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించాడు.
ఇదే మ్యాచ్‌లో బాబర్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో శతక్కొట్టిన బాబర్ (58 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌గా మూడు సెంచరీలు సాధించి, టీ20ల్లో అత్యధిక సార్లు ఈ మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2), స్విట్జర్లాండ్ సారధి ఫహీమ్ నజీర్ (2) ఉన్నారు.
ఇక ఇదే మ్యాచ్‌లో పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్-మహ్మద్ రిజ్వాన్ సంయుక్తంగా ఓ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించిన బాబర్-రిజ్వాన్ జోడీ టీ20ల్లో 19వ సారి 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో ఏ ఇతర జోడీ కూడా ఇన్ని సార్లు ఈ ఘనత సాధించలేదు. టీమిండియా ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీ20ల్లో 15 సార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో బాబర్ (101 నాటౌట్), రిజ్వాన్ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో పాకిస్తాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో చెలరేగాడు.
Comments
Please login to add a commentAdd a comment