IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు  | Bangalore lost by 6 wickets | Sakshi
Sakshi News home page

IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు

Published Sat, Mar 23 2024 1:20 AM | Last Updated on Sat, Mar 23 2024 12:34 PM

Bangalore lost by 6 wickets - Sakshi

తొలి పోరులో ఘన విజయం 

6 వికెట్లతో బెంగళూరు ఓటమి 

ముస్తఫిజుర్‌కు 4 వికెట్లు 

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్‌ కొత్త సీజన్‌ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్‌లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్‌ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్‌ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే రచిన్‌ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్‌. 

చెన్నై: ఐపీఎల్‌–2024ను సూపర్‌ కింగ్స్‌ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

అనూజ్‌ రావత్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్‌ రహమాన్‌ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు.  

భారీ భాగస్వామ్యం... 
బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్‌ భాగస్వామ్యమే కారణం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్‌ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ మెరుగ్గానే మొదలైంది. విరాట్‌ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్‌) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్‌కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి.

అయితే ముస్తఫిజుర్‌ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్‌ చక్కటి ఫీల్డింగ్‌కు డుప్లెసిస్‌ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్‌ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్‌ చేరాడు. మ్యాక్స్‌వెల్‌ (0) తొలి బంతికే అవుట్‌ కాగా, గ్రీన్‌ (18)ను ముస్తఫిజుర్‌ బౌల్డ్‌ చేశాడు.

ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్‌సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్‌ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్‌ వేసిన 18వ ఓవర్లో రావత్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టగా, కార్తీక్‌ మరో సిక్స్‌ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్‌సీబీ 71 పరుగులు సాధించింది.   

సమష్టి ప్రదర్శన... 
ఛేదనలో సీఎస్‌కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రుతురాజ్‌ (15) విఫలమైనా...ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రచిన్‌ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్‌లు), డరైల్‌ మిచెల్‌ (18 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్‌; 1 సిక్స్‌) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు.  

స్కోరు వివరాలు:  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 21; డుప్లెసిస్‌ (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 35; పటిదార్‌ (సి) ధోని (బి) ముస్తఫిజుర్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) చహర్‌ 0; గ్రీన్‌ (బి) ముస్తఫిజుర్‌ 18; రావత్‌ (రనౌట్‌) 48; కార్తీక్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173.  బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–37–1, తుషార్‌ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్‌ 4–0–29–4, జడేజా 4–0–21–0.  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) గ్రీన్‌ (బి) దయాళ్‌ 15; రచిన్‌ (సి) పటిదార్‌ (బి) కరణ్‌ 37; రహానే (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) గ్రీన్‌ 27; మిచెల్‌ (సి) పటిదార్‌ (బి) గ్రీన్‌ 22; దూబే (నాటౌట్‌) 34; జడేజా (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110.  బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–38–0, యశ్‌ దయాళ్‌ 3–0–28–1, జోసెఫ్‌ 3.4–0–38–0, కరణ్‌ శర్మ 2–0–24–1, డాగర్‌ 2–0–6–0, గ్రీన్‌ 3–0–27–2, 
మ్యాక్స్‌వెల్‌ 1–0–7–0.  

అలరించిన ఆరంభ వేడుకలు
తొలి మ్యాచ్‌కు ముందు చిదంబరం స్టేడియంలో  ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్‌ చౌహాన్, నీతి మోహన్‌ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్‌ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్‌ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు.   

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ X ఢిల్లీ
వేదిక: ముల్లన్‌పూర్‌
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 


కోల్‌కతా హైదరాబాద్‌
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement