తమ చరిత్ర, సాంప్రదాయాలపై ఆ్రస్టేలియా చూపించే ప్రేమ అందరికీ తెలిసిందే. టెస్టు మ్యాచ్ తొలి రోజు బ్యాగీ గ్రీన్ క్యాప్ పెట్టుకోవడం మొదలు ప్రత్యేకంగా టీమ్ సాంగ్ ఉండటం, గెలిచిన తర్వాత ఒక్కోసారి తమ షూస్‌లో షాంపేన్ పోసుకొని తాగే అలవాటు... ఇలా గతాన్ని ఇష్టపడే వీరు వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రతిభావంతుడైన ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయన్‌కు చోటు ఇచ్చి ఉంటే మరింత బాగుండేది.
2019 వరల్డ్ కప్ సెమీస్‌లో విఫలమైన తర్వాత లయన్ వన్డేలు ఆడలేదు. కానీ భారత పిచ్‌లపై మధ్య ఓవర్లలో అతను చాలా ప్రభావం చూపించగలిగేవాడు. టెస్టుల్లో రోహిత్, గిల్‌లను బాగా ఇబ్బంది పెట్టిన లయన్ అనుభవం పనికొచ్చేది. పైగా పోరాటతత్వంలో అతను అసలైన ఆ్రస్టేలియన్. ఐపీఎల్ కాంట్రాక్ట్ అవసరం లేదు కాబట్టి దానిని ఇంకా బాగా ప్రదర్శించేవాడేమో.
ఆ్రస్టేలియా వరల్డ్ కప్ మ్యాచ్ వేదికలు చెన్నై, లక్నోలాంటి చోట పిచ్‌లు చాలా నెమ్మదిగా ఉంటాయి. లయన్, జంపా కలిసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలిగేవారు. భారత్ అశ్విన్‌ను వెనక్కి తెచ్చి న తరహాలోనే ఆసీస్ లయన్‌ను తీసుకోవాల్సింది. భారత్ పరిస్థితి అందుకు భిన్నం. డెంగీతో గిల్ ఆడలేడు కాబట్టి కిషన్ వచ్చేస్తాడు. మిగతా లైనప్ విషయంలో సమస్య లేదు. ముగ్గురు స్పిన్నర్లూ ఖాయం. మన అభిమానులంతా జట్టు బౌలర్లకు మద్దతివ్వాలని కోరుతున్నా. ఎందుకంటే బౌలర్లు వరల్డ్ కప్ గెలిపించగలరు. బ్యాటర్లు సహకరిస్తారంతే. తొలి మ్యాచ్ కాబట్టి భారత్, ఆసీస్ పోరుపై కాస్త ఆసక్తి నెలకొంది.
కానీ నా దృష్టిలో భారత్‌కు ఈ మ్యాచ్ పెద్ద సమస్య కాదు. బలాబలాలను చూస్తే ఆస్ట్రేలియా బౌలింగ్ పేలవంగా ఉంది. పైగా చెన్నై వేడి వారి సమస్యను రెట్టింపు చేస్తుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే ఇక తిరుగుండదు. అయితే ఆసీస్ బ్యాటింగ్ మాత్రం బలంగా ఉందని చెప్పగలను. వారు ప్రమాదకర బ్యాటర్లు కూడా. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాక్కోగల సమర్థులు జట్టులో ఉన్నారు. సాధారణంగా బ్యాటింగే భారత్ బలం. కానీ దానికి భిన్నంగా ఈసారి మన బౌలర్లకూ, ఆసీస్ బ్యాటర్లకు మధ్య జరిగే పోరుగా నేను దీనిని చూస్తాను.
Comments
Please login to add a commentAdd a comment