ముంబై: ఐపీఎల్–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆటగాళ్లందరికీ వ్యాక్సిన్ ఇప్పించే ఆలోచన కూడా ఉందని ధుమాల్ వెల్లడించారు. ‘ఐపీఎల్ ఎక్కడ జరపాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.
భారత్‌లో నిర్వహించగల వనరులు మాకు ఉన్నాయని నమ్ముతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ వేదిక అనే మాటే ఉదయించదు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈకంటే భారత్‌లోనే పరిస్థితులు బాగున్నాయి. ఇదే కొనసాగి ఇక్కడే ఐపీఎల్ జరగాలని కోరుకుందాం’ అని ధుమాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్–ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టులను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్న బీసీసీఐ... అహ్మదాబాద్‌లో జరిగే తర్వాతి రెండు టెస్టుల విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. స్టేడియం మొత్తం సామర్థ్యం వరకు కాకుండా కనీసం 25–50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ధుమాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment