Sakshi News home page

BCCI: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్‌! అప్పీలుకు వెళ్లేది లేదన్న జై షా.. వాళ్లు మాట్లాడి..

Published Fri, Jul 28 2023 7:32 PM

BCCI To Question Harmanpreet Over Outburst No Appeal Planned: Jay Shah - Sakshi

ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్‌ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్‌కు చేరే క్రమంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్‌ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది.

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్‌ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్‌ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయింది. 

ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్‌ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది.

ఈ విషయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్‌తో మాట్లాడతారు.

మేమైతే ఆమె సస్పెన్షన్‌ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్‌ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్‌ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది.

చదవండి: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగింపు.. భువనేశ్వర్‌ కుమార్‌ కీలక నిర్ణయం! 
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. 

Advertisement

What’s your opinion

Advertisement