సెప్టెంబర్‌లో స్వదేశంలో మొదలయ్యే టెస్ట్ సీజన్‌కు ముందు భారత టెస్ట్ స్పెషలిస్ట్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులందరూ ఆగస్ట్ నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో పాల్గొనాలని సూచించింది.
ప్రతి ఆటగాడు కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు మినహాయింపు ఉన్నట్లు తెలుస్తుంది. కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం.
కాగా, భారత టెస్ట్ సీజన్ సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో మొదలవుతుంది. అనంతరం భారత్.. స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. నవంబర్ 22-వచ్చే ఏడాది జనవరి 7 మధ్యలో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్తుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది.
ఇదిలా ఉంటే, టీమిండియా టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. పొట్టి ప్రపంచకప్ ముగిశాక జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన భారత్.. జులై 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.
అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. లంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టుకు ఇవాళ (జులై 16) ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment