టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ టెస్టు(బీజీటీ) సిరీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు రోహిత్ సేన నవంబరులో కంగారూ దేశంలో పర్యటించనుంది. ఈ ఆసక్తికర పోరుకు ఇంకా దాదాపు రెండు నెలల వ్యవధి ఉన్నా.. ఇప్పటి నుంచే గెలుపోటములపై విశ్లేషకులు, అభిమానుల మధ్య చర్చ మొదలైంది.
సీనియర్లు లేకుండానే
మరోవైపు.. ఆసీస్ స్టార్లు సైతం టీమిండియాతో సిరీస్‌కు తామెంతగానో నిరీక్షిస్తున్నామని.. యాషెస్ మాదిరి మజా అందించే మరో పోరు ఇదేనంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కాగా గత నాలుగు పర్యాయాలుగా బీజీటీ సిరీస్ భారత్‌దేనన్న విషయం తెలిసిందే.
అయితే, ఆఖరిగా కంగారూ గడ్డపై సిరీస్ గెలిచినపుడు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి వెటరన్ ప్లేయర్లు జట్టుతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. అయితే, రిషభ్ పంత్ గతంలో మాదిరి బ్యాట్ ఝులిపిస్తే మాత్రం ఆసీస్‌కు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ.. టీమిండియాను నిలువరించాలంటే పంత్‌ను కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే
‘‘నాకు తెలిసి భారత ఆటగాళ్లు ఇక్కడా దూకుడుగానే ఆడతారు. ముఖ్యంగా రిషభ్ ఎక్కువగా అద్భుతమైన రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం కూడా! ఈ సిరీస్‌లో అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి పంత్‌ను కట్టడి చేస్తే మా పని సగం పూర్తవుతుంది’’ అని కమిన్స్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.
నాడు పంత్ వీరోచిత ఇన్నింగ్స్
2020-21 పర్యటన సందర్భంగా సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులతో దుమ్ములేపి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక ఆఖరిదైన గాబా టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విజయం సాధించేలా చేశాడు.
రీఎంట్రీలో శతక్కొట్టి
ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన పంత్ 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత.. దాదాపు రెండేళ్లకు పంత్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని తొలి టెస్టులో శతకం(109)తో కదం తొక్కాడు. పునరాగమనంలో మొత్తంగా 148 పరుగులు సాధించాడు.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment