టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్‌సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్‌ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు.
బుమ్రా.. క్రైస్ట్‌చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది.
వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్‌గా ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్‌పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్‌తో మూడో టెస్ట్‌కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment