బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన ఉమేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను సద్వినియోగం చేసుకున్న అవకాశం బ్యాట్‌తో అనుకుంటే పొరపాటే. ఉమేశ్.. మూడో టెస్ట్ తొలి రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది తన బ్యాటింగ్ నైపుణ్యంతో.
ఈ మ్యాచ్‌లో పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఉమేశ్.. 13 బంతుల్లో 2 సిక్సర్లు, బౌండరీ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఉమేశ్.. ఓ విషయంలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 24 సిక్సర్లు బాదగా.. ఈ మ్యాచ్‌లో కొట్టిన 2 సిక్సర్లు కలుపుకుని ఉమేశ్ కూడా తన కెరీర్‌లో అన్నే సిక్సర్లు బాదాడు. విరాట్ సిక్సర్ల రికార్డును సమం చేసే క్రమంలో ఉమేశ్.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (22 సిక్సర్లు), భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (22)ల రికార్డులను అధిగమించాడు.
ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉండగా.. ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (68), కపిల్ దేవ్ (61) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఉమేశ్, విరాట్‌తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్‌కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment