ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తమ ఇన్నింగ్స్ ప్రారంభించి పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండానే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాది జోష్ మీద కనిపించిన యశస్వి జైస్వాల్ రెండో బంతికే స్టార్క్ పన్నిన పన్నాగానికి బలయ్యాడు. స్టార్క్ సంధించిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన యశస్వి షార్ట్ మిడ్‌వికెట్‌లో కాపు కాసిన మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఈ బంతిని ఆడాల్సి అవసరం లేదు. వదిలేస్తే సరిపోయేది. కానీ గిల్ వెంటాడి మరీ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ గల్లీలో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ ఒక్క పరుగు వద్దే ముగిసింది. భారత్ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చేసిన తప్పునే మరోసారి చేశాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఇలాంటి బంతులను ఎదుర్కోవడంలో విరాట్ తరుచూ విఫలమవుతున్నాడు.
Virat Kohli and the delivery outside off stump 🥲
Same story!pic.twitter.com/kuHQXBPLjY— CricTracker (@Cricketracker) December 16, 2024
విరాట్ ప్రతిసారి ఒకే తరహాలో ఔట్ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. చేసిన తప్పునే ఎన్ని సార్లు చేస్తావు. నేర్చుకోవా అంటూ చురకలంటిస్తున్నారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతులను డ్రైవ్ చేయాల్సిన అవసరమేముందంటూ తలంటుతున్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి విరాట్ పెవిలియన్ బాటపట్టాడు.
మొత్తానికి మూడో రోజు తొలి సెషన్‌లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. కేఎల్ రాహుల్‌కు (13) జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. విరాట్ ఔట్ కాగానే వర్షం మొదలైంది. అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.
అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment