12 పరుగుల తేడాతో కెనడా జయభేరి
సమష్టిగా దెబ్బతీసిన బౌలర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శాశ్వత సభ్య దేశం ఐర్లాండ్ జట్టుకు తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన పోరులో కెనడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకొని 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), నవ్‌నీత్ ధలివాల్ (6) సహా పర్గత్ సింగ్ (18), దిల్‌ప్రీత్ (7) నిరాశపరిచారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ కిర్టన్ (35 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొవ్వ శ్రేయస్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించడంతో కెనడా కోలుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో క్రెయిగ్ యంగ్, మెకార్తి చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఓడిపోయింది. హేలిగెర్ (2/18), గొర్డాన్ (1/13), సిద్ధిఖీ (1/27), జాఫర్ (1/22) సమష్టిగా దెబ్బ కొట్టారు. దీంతో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డాక్‌రెల్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ అడైర్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా చివరకు ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment