ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది.
ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి.
ఆ ముగ్గురు ఉంటారు.. అయితే
ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘వరల్డ్‌కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్.
చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి
అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్‌లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు.
అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు!
Comments
Please login to add a commentAdd a comment