వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఓటమి కొరల్లో (91/7) చిక్కుకున్న ఆసీస్‌ను మ్యాక్సీ వీరోచితంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. కదలలేని స్థితిలో సైతం మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్రతి క్రికెట్ అభిమాని మనసు దోచుకున్నాడు. మ్యాక్సీ బ్యాట్ నుంచి జాలువారిన ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది.
ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీ అన్నీ తానై వ్యవహరించగా, కెప్టెన్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (68 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) ఆడి తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ పలు అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకోగా.. కమిన్స్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ రికార్డు వ్యక్తిగతంగా కమిన్స్‌కు చెత్త రికార్డే అయినప్పటికీ.. ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. ఓ పక్క మ్యాక్సీ చెలరేగుతుంటే, మరో ఎండ్‌లో కమిన్స్ వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీలా కమిన్స్ పాత్ర కూడా వెలకట్టలేనిది. ఒకవేళ కమిన్స్ మ్యాక్స్‌వెల్‌కు సహకరించకపోయి ఉంటే ఆసీస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఇంతకీ కమిన్స్ పేరిట నమోదైన ఆ చెత్త రికార్డు ఏంటంటే.. వరల్డ్‌కప్‌లో కనీసం 10 పరుగులు చేసి రెండో అత్యల్ప స్ట్రయిక్‌రేట్ నమోదు చేసిన ఆటగాడిగా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న కమిన్స్ కేవలం 17.64 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌లో కనీసం 10 పరుగులు చేసి ఇంతకంటే తక్కువ స్ట్రయిక్‌రేట్ నమోదు చేసిన రికార్డు జింబాబ్వే ఆటగాడు జాక్ హెరన్ పేరిట ఉంది. 1983 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరన్ అత్యల్పంగా 16.43 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. రికార్డు విషయం అటుంచితే, కమిన్స్ మ్యాక్సీతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. కాగా, ఆఫ్ఘన్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment