న్యూజిలాండ్‌పై ఆసీస్‌ గెలుపు.. స్టార్క్‌ జైత్రయాత్రకు ముగింపు.. పలు రికార్డుల వివరాలు | CWC 2023 AUS VS NZ: Starc Minimum 1 Wicket Streak In A World Cup Match Came To An End After 23 Matches | Sakshi
Sakshi News home page

CWC 2023 AUS VS NZ: న్యూజిలాండ్‌పై ఆసీస్‌ గెలుపు.. స్టార్క్‌ జైత్రయాత్రకు ముగింపు

Published Sat, Oct 28 2023 8:14 PM | Last Updated on Sat, Oct 28 2023 8:18 PM

CWC 2023 AUS VS NZ: Starc Minimum 1 Wicket Streak In A World Cup Match Came To An End After 23 Matches - Sakshi

ఆసీస్‌తో ఇవాళ (అక్టోబర్‌ 28) జరిగిన ఉత్కంఠ సమరంలో న్యూజిలాండ్‌ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన కివీస్‌.. ప్రత్యర్ధికి ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలైంది. రచిన్‌ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్‌ నీషమ్‌ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి కివీస్‌ను గెలిపించినంత పని చేశారు. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్‌ కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేక ఓటమిపాలైంది. 

ఆసీస్‌ గెలిచినా..

  • ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలిచినా, ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మాత్రం చెత్త గణాంకాలను నమోదు చేయడంతో పాటు వరల్డ్‌కప్‌లో తన వికెట్ల జైత్రయాత్రకు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన స్టార్క్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 89 పరుగులు సమర్పించుకుని వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 
  • ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ మరో చెత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో గత 23 మ్యాచ్‌లుగా సాగుతున్న తన వికెట్ల జైత్రయాత్రకు (మ్యాచ్‌లో కనీసం ఓ వికెట్‌ తీయడం) ఈ మ్యాచ్‌తో ఎండ్‌ కార్డ్‌ పడింది. 

పై రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..

  • వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక సిక్సర్ల సంఖ్య (32) రికార్డు ఈ మ్యాచ్‌లో నమోదైంది. ఈ విభాగంలో 2019 వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ టాప్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదయ్యాయి.
  • వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక బౌండరీల సంఖ్య (97) రికార్డు ఈ మ్యాచ్‌లో నమోదైంది. ఈ జాబితాలో టాప్‌లో ఇదే వరల్డ్‌కప్‌లో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌ ఉంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 105 బౌండరీలు నమోదయ్యాయి.
  • వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్‌ (383/9) రికార్డును న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో నమోదు చేసింది. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్‌ మ్యాచ్‌ టాప్‌లో ఉంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో 2009లో జరిగిన భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది. నాటి మ్యాచ్‌లో భారత్‌ నిర్ధేశించిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 411 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 
  • ఓటమిలో (వరల్డ్‌కప్‌లో) అత్యధిక స్కోర్‌ (383/9) చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్‌లో లంకేయులు 344/9 స్కోర్‌ చేయగా.. పాక్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.  
  • వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్‌లు (3) అందుకున్న నాన్‌ వికెట్‌కీపర్‌ స్టార్క్‌ రికార్డుల్లోకెక్కాడు. గతంలో అలెన్‌ బోర్డర్‌, రికీ పాంటింగ్‌, ఆరోన్‌ ఫించ్‌ (నాన్‌ వికెట్‌కీపర్స్‌) కూడా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో 3 క్యాచ్‌లు పట్టారు.  
  • వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్‌ మ్యాచ్‌ (872) టాప్‌లో ఉండగా.. 2009 భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ (825) రెండో స్థానంలో నిలిచింది.  ఇవే కాక ఈ మ్యాచ్‌లో పలు చిన్నా చితక రికార్డులు కూడా నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement