ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన రసవత్తర సమరంలో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆసీస్‌కు ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలయ్యారు.
కివీస్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా నీషమ్ తన జట్టును గెలిపించేందుకు చివరి నిమిషం వరకు పోరాడి విఫలమయ్యాడు. ఆఖరి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో నీషమ్ లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అయినా కివీస్ గెలిచేందుకు చివరి బంతికి కూడా అవకాశం ఉండింది.
ఆఖరి బంతికి ఫెర్గూసన్ సిక్సర్ బాది ఉంటే న్యూజిలాండ్ సంచలన విజయం సాధించి ఉండేది. చివరి బంతిని స్టార్క్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ వీరోచిత పోరాటం ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించి ఉంటే, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఛేదనగా మిగిలిపోయి ఉండేది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్, నీషమ్‌తో పాటు డారిల్ మిచెల్ (54) కూడా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment