CWC 2023 ENG VS AFG: వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేసిన రూట్‌ | CWC 2023 ENG VS AFG: Joe Root Equals The Record Of Most Catches Taken By A Non WK In A World Cup Match | Sakshi
Sakshi News home page

CWC 2023 ENG VS AFG: వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేసిన రూట్‌

Published Sun, Oct 15 2023 6:51 PM | Last Updated on Mon, Oct 16 2023 7:55 PM

CWC 2023 ENG VS AFG: Joe Root Equals The Record Of Most Catches Taken By A Non WK In A World Cup Match - Sakshi

న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 15) జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ జో రూట్‌ ఓ వరల్డ్‌కప్‌ రికార్డును సమం చేశాడు. బ్యాటర్‌, బౌలర్‌ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్‌.. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టి, వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు ఆందుకున్న నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

గతంలో మొహమ్మద్‌ కైఫ్‌ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్‌ (2015లో స్కాట్లాండ్‌పై), ఉమర్‌ అక్మల్‌ (2015లో ఐర్లాండ్‌పై), క్రిస్‌ వోక్స్‌ (2019లో పాకి​స్తాన్‌పై)లు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో నాలుగు క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్‌ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో రూట్‌ నాలుగు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ షాహీదిని రూట్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్‌ పట్టిన రషీద్‌ ఖాన్‌ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. లాంగ్‌ ఆన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్‌ చేస్తూ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు రూట్‌.  

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఇంగ్లండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్‌ అలీఖిల్‌ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్‌ (28), రషీద్‌ ఖాన్‌ (23), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.

వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (4-0-41-0), మార్క్‌ వుడ్‌ (9-0-50-2), సామ్‌ కర్రన్‌ (4-0-46), రీస్‌ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్‌ రషీద్‌ (10-1-42-3), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (10-0-33-1), జో రూట్‌ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్‌ హక్‌ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్‌ ఔట్‌ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 33/2గా ఉంది. డేవిడ్‌ మలాన్‌ (19), హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement