వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ కేవలం 41.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్, రికార్డుల రారాజు, కింగ్ కోహ్లి వన్డే కెరీర్‌లో 48వ శతకాన్ని సాధించి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
బంగ్లాదేశ్‌పై విజయానంతరం రోహిత్ ఏమన్నాడంటే..
చాలా మంచి విజయం. ఇలాంటి విజయాలనే కోరుకున్నాం. సరైన ఆరంభం లభించనప్పటికీ, మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. టోర్నీ ప్రారంభం నుంచి మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మా ఫీల్డర్లు మైదనంలో పాదరసంలా కదిలారు. అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. పరిస్థితులకు అనుగణంగా ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లోనూ అదే ఆచరణలో పెట్టారు. ఇవాళ జడ్డూ బౌలింగ్ అత్యుత్తమంగా ఉంది. సూపర్ క్యాచ్ కూడా అందుకున్నాడు. కానీ కోహ్లి సెంచరీ ముందు ఇవన్ని తక్కువే.
జట్టుగా రాణిస్తుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మైదానంలో అన్ని ప్రదర్శనలకు పతకం (డ్రెస్సింగ్ రూమ్ అవార్డులు) లభిండచం ఆటగాళ్లను బాగా ప్రేరేపిస్తుంది. హార్దిక్ గాయం అంత తీవ్రమైందేమీ కాదు. నొప్పితో బాధపడుతున్నాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేస్తాము. ప్రేక్షకులు భారీ సంఖ్యలో మైదానాలకు వచ్చి మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరుస్తున్నారు. ఈ అనుభూతి చాలా బాగుంది. ఇది మాలోని అత్యుత్తమ ప్రదర్శనలు వెలికితీయడానికి దోహదపడుతుంది. టోర్నీలో మున్ముందు కూడా ప్రేక్షకుల నుంచి ఇదే ఆశిస్తున్నాం.
రాణించిన ఓపెనర్లు.. తేలిపోయిన మిడిలార్డర్
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) శుభారంభాన్ని అందించారు. మధ్యలో బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. ఆఖర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు ఆ తర్వాత పుంజుకుని బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
శతక్కొట్టిన కోహ్లి.. రాణించిన గిల్, హిట్‌మ్యాన్
257 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు కూడా శుభారంభయే లభించింది. గిల్ (53), రోహిత్ (48) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్‌లో మరో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ (19) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. రాహుల్ (34 నాటౌట్) తన ఫామ్‌ను కొనసాగించాడు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 2, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment