Deodhar Trophy 2023: South Zone Beat North Zone By 185 Runs In VJD Method, Score Details Inside - Sakshi
Sakshi News home page

Deodhar Trophy 2023: రాణించిన మయాంక్‌ అగర్వాల్‌.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్‌

Published Tue, Jul 25 2023 11:54 AM | Last Updated on Tue, Jul 25 2023 12:21 PM

Deodhar Trophy 2023: South Zone Beat North Zone By 185 Runs In VJD Method - Sakshi

దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్‌ (డక్‌వర్త్‌ లూయిస్‌కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్‌ జోన్‌పై గెలుపొందింది.  

కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్‌ కున్నుమ్మల్‌ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్‌ జగదీశన్‌ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌జోన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

సౌత్‌జోన్‌ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (17), వాషింగ్టన్‌ సుందర్‌ (5) విఫలం కాగా.. రికీ భుయ్‌ (31), అరుణ్‌ కార్తీక్‌ (21) పర్వాలేదనిపించారు. నార్త్‌ జోన్‌ బౌలర్లలో రిషి ధవన్‌, మయాంక్‌ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌, మయాంక్‌ డాగర్‌, నితీశ్‌ రాణా తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

సౌత్‌ జోన్‌ ఇన్నింగ్స్‌ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్‌) పద్ధతిన నార్త్‌ జోన్‌ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్‌ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (2/12), వాసుకి కౌశిక్‌ (1/11),  నిప్పులు చెరగడంతో నార్త్‌ జోన్‌ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.

గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్‌ శర్మ (1), గత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ (2), నితీశ్‌ రాణా (4), రిషి ధవన్‌ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో శుభమ్‌ ఖజూరియా (10), మన్‌దీప్‌ సింగ్‌ (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్‌ జోన్‌ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్‌ సాయికిషోర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

విజేడీ పద్ధతి అంటే..
వి జయదేవన్‌ పద్ధతి.. క్రికెట్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్‌లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్‌లలో లక్ష్య స్కోర్‌లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది.

కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్‌ లాయిడ్‌ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్‌ల్లో ఉపయోగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement