రోహిత్ శర్మతో అశ్విన్
ICC WC ODI 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ఆడే జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎందుకు చోటివ్వలేదని ప్రశ్నించాడు. అసలు అశూ ఏం తప్పు చేశాడో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు.
కాగా చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్ ఆడిన టీమిండియా 6 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(అక్టోబరు 11)న ఆఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఇందుకు వేదికకాగా.. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది.
శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి వచ్చాడు. ఆఫ్గనిస్తాన్‌పై మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీని కాదని.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్‌వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది.
ప్రతిసారి ఇలాగే..
ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. అశ్విన్‌ను ఎందుకు తప్పించారో.. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ మండిపడ్డాడు. ‘‘మరోసారి అశ్విన్‌ను తప్పించారు. అసలు అతడేం తప్పు చేశాడో అర్థం కావడం లేదు.
ప్రతిసారి ఇలాగే.. ఒక మ్యాచ్‌లో ఆడించడం.. తదుపరి మ్యాచ్‌లో పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. ఇక షమీ.. 2019లో షమీ అఫ్గనిస్తాన్ మీద చెలరేగిన విషయం మర్చిపోయినట్టున్నారు. కనీసం అతడినైనా ఆడించాల్సి కదా!’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో అసహనం ప్రదర్శించాడు. అశ్విన్, షమీల విషయంలో రోహిత్ నిర్ణయాన్ని ఈ మాజీ కెప్టెన్ ఈ సందర్భంగా తప్పుబట్టాడు.
నాటి మ్యాచ్‌లో షమీకే ఎక్కువ వికెట్లు
కాగా 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో షమీ 9.5 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది.
గావస్కర్ ఇలా.. గంభీర్ అలా
ఇక తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. పేసర్లు బుమ్రా నాలుగు, హార్దిక్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒకటి.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. కాగా అరుణ్‌జైట్లీ స్టేడియం పిచ్ ఆఫ్ స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చంటూ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
చదవండి: WC 2023: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment