కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ (PC: ICC/Disney+Hotstar)
ICC WC 2023- Ind Vs SL- KL Rahul- Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై అత్యద్భుత విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టింది టీమిండియా. సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ ఆరంభం నుంచే సమిష్టి కృషితో ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. ఇప్పటి వరకు ఏడింట ఏడు గెలిచింది.
లీగ్ దశలో ఇప్పటి వరకు అజేయంగా నిలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ముంబైలోని వాంఖడేలో టీమిండియా పేసర్ల సంచలన ఆట తీరు అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.
టీమిండియా పేసర్ల విజృంభణ
భారత జట్టు విధించిన 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఆదిలోనే షాకిచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ పాతుమ్ నిసాంకను అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో మహ్మద్ సిరాజ్ కరుణరత్నెను పెవిలియన్‌కు పంపాడు.
అదే ఓవరల్లో సమరవిక్రమను కూడా అవుట్ చేశాడు. బుమ్రా, సిరాజ్ ధాటికి మొదటి రెండు ఓవరల్లో 2 పరుగులు మాత్రమే చేసిన లంక మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్ మరొకటి, మహ్మద్ షమీ ఏకంగా ఐదు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీయడంతో 55 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో కాసేపు నిలవకపోడంతో 302 పరుగుల తేడాతో భారీ మూల్యమే చెల్లించింది.
రాహుల్ ఆత్మవిశ్వాసంతో
అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ల ప్రదర్శనతో పాటు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సైతం తన అద్భుతమైన నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో మూడో బంతికి దుష్మంత చమీర ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ ఒడిసిపట్టాడు.
అయితే, అంపైర్ క్రిస్ బ్రౌన్ ఈ బంతిని తొలుత వైడ్‌గా ప్రకటించి నాటౌట్ ఇచ్చాడు. కానీ.. రాహుల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా అప్పీలు చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లాడు.
ఈ క్రమంలో బంతి చమీర బ్యాట్‌ను తాకడంతో పాటు రాహుల్ గ్లోవ్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని చమీరను అవుట్‌గా ప్రకటించాడు. ఇలా రాహుల్ తన డేగ కళ్లతో సునిశిత దృష్టితో అప్పీలు చేసిన విధానం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే.. అది మాత్రం తప్పని తేలింది
అయితే, ఇదే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో రెండో ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమ విషయంలో రాహుల్ అప్పీలుకు వెళ్లగా ప్రతికూల ఫలితం వచ్చింది. బాల్ అవుట్‌సైడ్ ఎడ్జ్‌ను మిస్ అయినట్లు తేలడంతో సమరవిక్రమ బతికిపోయాడు.
వాళ్లపై నమ్మకం ఉంది.. వాళ్లదే బాధ్యత
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ రివ్యూ సిస్టం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని నేను పూర్తిగా మా బౌలర్లు, కీపర్‌కే వదిలేశా.
వాళ్లు డిసైడ్ అయిన తర్వాతే నాకు చెప్పమని చెప్పాను. వాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే, ఒక్కోసారి అంచనాలు నిజం కావొచ్చు.. మరొకసారి ప్రతికూల ఫలితం రావొచ్చు. ఈరోజు రివ్యూ విషయంలో మా నిర్ణయం ఒకటి కరెక్ట్ అయింది. మరొకటి తప్పని తేలింది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. అంత కోపమెందుకో?
Comments
Please login to add a commentAdd a comment