
సిఫ్ట్ కౌర్‌కు స్వర్ణం
మనూ భాకర్ విఫలం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్ జియాన్ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది.
ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ మనూ భాకర్ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో మనూ భాకర్ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్‌లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్ ప్రారంభ ప్రపంచకప్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
అనిట మంగోల్డ్ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్ కౌర్‌కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్ అనిట మంగోల్డ్ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్ కౌర్ ఆ తర్వాత అదరగొట్టింది.
నీలింగ్ పొజిషన్‌లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో సిఫ్ట్ కౌర్ 590 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.