తమ జట్టు గురించి ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు. జోష్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తమ దృష్టి ప్రస్తుతం మిగిలిన రెండు మ్యాచ్‌లపైనే ఉందని తెలిపాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో పాటు ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. వీటిలో వరుసగా మూడు విజయాలు సాధించిన ఆసీస్.. గ్రూప్ టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.
ఇక ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు రెండింట భారీ తేడాతో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తాము గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని దుస్థితిలో ఉంది డిఫెండింగ్ చాంపియన్.
ఇక మూడింట రెండు విజయాలతో ఉన్న స్కాట్లాండ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. తమకు ఆస్ట్రేలియాతో మిగిలిన మ్యాచ్‌లో గనుక గెలిస్తే నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఆసీస్ మ్యాచ్ అంటే అంత తేలికాదన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నమీబియాపై గెలుపుతో సూపర్-8 చేరిన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి బయటకు పంపాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.
ఈ క్రమంలో కావాలనే స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంగ్లండ్ సూపర్-8 ఆశలపై నీళ్లు చల్లాలని ఆసీస్ కుట్ర పన్నిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్.. జోష్ హాజిల్‌వుడ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
అతడు కేవలం సరదాగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశాడని.. జోష్ నిజాయితీ గురించి తనకు తెలుసునని పేర్కొన్నాడు. ఒమన్, నమీబియా జట్లపై విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాథ్యూ మాట్ పేర్కొన్నాడు.
నమీబియాను చిత్తు చేసి
గ్రూప్-బిలో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 34 బంతుల్లోనే ఛేదించింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... పేసర్లు హాజల్‌వుడ్, స్టొయినిస్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కమిన్స్, ఎలిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
నమీబియా జట్టులో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (43 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), మైకేల్ వాన్ లింగెన్ (10 బంతుల్లో 10; 2 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరు దాటలేకపోయారు.
అనంతరం ఆస్ట్రేలియా జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా... ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్ష్ (9 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. జూన్ 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment