లంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌; రెండేళ్ల త‌ర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్‌! | Ex-Captain-Surprise Entry-ODIs-After-2 Years-SL-Squad Announced-ENG Tour | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ టూర్‌కు లంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌; రెండేళ్ల త‌ర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్‌!

Sep 2 2026 5:18 PM | Updated on Sep 2 2026 6:32 PM

Ex-Captain-Surprise Entry-ODIs-After-2 Years-SL-Squad Announced-ENG Tour

Photo Credit: Twitter

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఈ నెల 15 నుంచి శ్రీలంక జ‌ట్టు వైట్‌బాల్ సిరీస్ (వ‌న్డే, టీ20లు) ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో బుధవారం శ్రీలంక క్రికెట్ బోర్డు వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు 16 మందితో కూడిన వేర్వేరు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. గాయాల నుంచి కోలుకున్న లంక విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు కుశాల్ మెండిస్‌, పాతుమ్ నిస్సాంకలు తిరిగి జ‌ట్టుతో చేరారు. 

వ‌న్డే, టీ20 జ‌ట్ల‌కు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా, చ‌రిత్ అస‌లంక అత‌డికి డిప్యుటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇటీవ‌లే గాయాల‌తో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూర‌మైన పాతుమ్ నిస్సాంక‌, కుశాల్ మెండిస్ తిరిగి రావ‌డం లంక జ‌ట్టును బ‌లంగా మార్చేసింది. 

2027 వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో..
జ‌ట్టు ఎంపిక‌లో మ‌రో విశేష‌మేమిటంటే.. రెండేళ్ల త‌ర్వాత మాజీ కెప్టెన్ దాసున్ ష‌న‌క వ‌న్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2024 జ‌న‌వ‌రిలో చివ‌రి వ‌న్డే ఆడిన ష‌న‌క మ‌ళ్లీ ఇన్నాళ్లకు జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. ప‌నిలో ప‌నిగా వ‌న్డేల‌తో పాటు టీ20 జ‌ట్టుకు కూడా ష‌న‌క‌ను ఎంపిక చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం 35 ఏళ్లున్న ష‌న‌క 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో లంక జ‌ట్టులో కీల‌క ఫినిష‌ర్ కానున్న నేపథ్యంలో అతడి ఎంపిక ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇంగ్లండ్ టూర్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన చ‌రిత్ అస‌లంక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 త‌ర్వాత జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన లంక ప్రీమియ‌ర్ లీగ్ (ఎల్‌పీఎల్ 2026)లో చ‌రిత్ అస‌లంక 153 స్ట్రైక్‌రేట్‌తో 385 ప‌రుగులు సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ గ‌డ్డ‌పై త‌మ ప‌ర్య‌ట‌న‌ను ఆత్మ‌విశ్వాసంతో ఆరంభించ‌నుంది.

ఆ ఇద్దరి స్థానాలు పదిలం..
లంక ప్రీమియ‌ర్ లీగ్‌లో అద‌ర‌గొట్టిన క‌మిల్ మిషారా (411 ర‌న్స్‌), లాహిరు ఉదారా (434 ర‌న్స్‌) రెండు జ‌ట్ల‌లోనూ త‌మ స్థానాల‌ను నిల‌బెట్ట‌కున్నారు. క‌మిందు మెండిస్ కూడా రెండు జ‌ట్లలోనూ చోటు ద‌క్కించుకోగా, మ‌రో సీనియ‌ర్ వ‌నిందు హ‌స‌రంగ‌తో పాటు దునిత్ వెల్ల‌లాగేలు కూడా వ‌న్డే, టీ20 జ‌ట్ల‌కు ఎంపిక‌య్యారు. 

లంక స్టార్ బౌల‌ర్ మ‌హీశ్ తీక్ష‌ణ రాక‌తో స్పిన్ విభాగం బ‌ల‌ప‌డింది. ఇక పేస్ విభాగంలో ఇషాన్ మ‌లింగ‌, దుష్మంత చ‌మీర‌లు కీల‌కం కానున్నారు.  సెప్టెంబ‌ర్ 5న లంక జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నుంది.

ఇంగ్లండ్‌, శ్రీలంక టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్‌:
👉తొలి టీ20 మ్యాచ్‌:  సెప్టెంబ‌ర్ 15న‌, సౌతాంప్ట‌న్ 
👉రెండో టీ20 మ్యాచ్‌: సెప్టెంబ‌ర్ 17న‌, కార్డిఫ్‌
👉మూడో టీ20 మ్యాచ్‌: సెప్టెంబ‌ర్ 19న, మాంచెస్ట‌ర్‌

👉తొలి వ‌న్డే మ్యాచ్‌: సెప్టెంబ‌ర్ 22న‌, చెస్ట‌ర్ లీ స్ట్రీట్‌
👉రెండో వ‌న్డే మ్యాచ్‌: సెప్టెంబ‌ర్ 24న, లీడ్స్‌
👉మూడో వ‌న్డే మ్యాచ్‌: సెప్టెంబ‌ర్ 27న‌, ఓవ‌ల్‌

శ్రీలంక వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్‌), జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహీశ్ తీక్షణ, సచిందు కొలంబాగే,  దుష్మంత చ‌మీర‌, ఇషాన్ మలింగ‌, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మ‌ధుషంక‌.

శ్రీలంక టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, లహిరు ఉదార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్‌), జనిత్ లియానగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, త‌రిందు ర‌త్న‌నాయ‌కె, దుష్మంత చ‌మీర‌, ఇసాన్ మలింగ‌, నువాన్ తుషారా, బినూర ఫెర్నాండో.

చదవండి: ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన ప‌డిక్క‌ల్‌, అతడికి కెరీర్‌ బెస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement