పడిక్కల్, ఇన్‌సెట్‌లో లంక బ్యాటర్ సోనల్ దినూష (PC: Twitter)
శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు.
నిజానికి ఇదేమి గొప్ప ర్యాంక్ కాకపోయినప్పటికీ, పడిక్కల్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడమే గాక, భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా (328 పరుగులు) నిలిచాడు. టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలవడం వెనుక పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు.
గిల్, పంత్ మినహా
మిగతా బ్యాటర్ల విషయానికొస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక సిరీస్‌లో ఒక అర్థసెంచరీ మాత్రమే సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి గిల్, పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు.
రెండుకు ఎగబాకిన స్మిత్
ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన లంక బ్యాటర్ సోనల్ దినూష ఏకంగా 29 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (856 పాయింట్లు) కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో లంక టూర్‌కు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా తన నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (ఏడో స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.


