జీవితం ఎప్పుడు, ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావొచ్చు. శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రాందీవ్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఒకప్పుడు జాతీయ జట్టులో రెగ్యులర్ మెంబర్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు బస్ డ్రైవర్‌గా మారాడు.
ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఈ స్పిన్నర్.. ఇప్పుడు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే వృత్తిలో కొనసాగుతున్నాడు. కుడిచేతి వాటం గల స్పిన్ బౌలర్ అయిన సూరజ్.. 1985, జనవరి 30న శ్రీలంకలో జన్మించాడు. 2009లో శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
టీమిండియాతో మ్యాచ్‌తో అరంగేట్రం
టీమిండియాతో భారత్‌లో జరిగిన వన్డేతో సూరజ్ అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో, టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2011 ఆడిన లంక జట్టులో అతడు సభ్యుడు. టీమిండియాతో ఫైనల్లో సూరజ్ రాందీవ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
సీఎస్‌కే తరఫున ఆడిన సూరజ్
ఇక తన కెరీర్‌లో మొత్తంగా 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూరజ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(2011)కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టుల్లో 43, వన్డేల్లో 36, టీ20లలో 7 వికెట్లు తీసిన ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్.. ఐపీఎల్‌లో 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2016లో చివరి అంతర్జాతీయ(వన్డే) మ్యాచ్ ఆడిన సూరజ్ రాందీవ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు.
మరో ఇద్దరు క్రికెటర్లు కూడా
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. మెల్‌బోర్న్‌లోని లోకల్ క్లబ్ ఆటగాడిగా కొనసాగాడు. ఈ క్రమంలో బస్ డ్రైవర్‌గా అవతారమెత్తిన సూరజ్ ట్రాన్స్‌డెవ్ అనే కంపెనీ ఉద్యోగిగా మారాడు. దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీలో సూరజ్‌తో మరో ఇద్దరు క్రికెటర్లు కూడా డ్రైవర్లుగా పనిచేస్తుండటం మరో విశేషం.
ఆటను మరువలేదు
శ్రీలంక మాజీ ఆటగాడు చింతక జయసింఘే, జింబాబ్వే క్రికెటర్ వాడింగ్టన్ మ్వేంగా కూడా ఇక్కడే డ్రైవర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. డ్రైవర్‌గా మారినప్పటికీ సూరజ్ రాందీవ్.. ఆటను మరువలేదు. ఈ ఏడాది టీతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా సూరజ్ సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. ఆసీస్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు ఈ స్పిన్నర్‌ను పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇక సూరజ్ కథను నెటిజన్లు తాజాగా ప్రస్తావిస్తూ మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.
చదవండి: మీరు వెనక్కి తగ్గకండి.. ముందు భారత జట్టు పాక్‌కు రాని! ఆ తర్వాతే ఏదైనా
Comments
Please login to add a commentAdd a comment