ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్‌.. గంభీర్ రాజీమానాకు డిమాండ్‌! | Fans Demands-Gambhir Resignation-Head Coach-After Dharmendra Pradhan Steps-Down | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్‌.. గంభీర్ రాజీమానాకు డిమాండ్‌!

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 8:58 AM

Fans Demands-Gambhir Resignation-Head Coach-After Dharmendra Pradhan Steps-Down

నీట్ లీకేజీ వ్య‌వ‌హారంలో దేశ‌వ్యాప్తంగా యువ‌త‌రం భ‌గ్గుమ‌నడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద‌ కాక్రోచ్ జ‌నతా పార్టీ త‌ల‌పెట్టిన ఉద్య‌మానికి యువ‌తరం పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో చివ‌ర‌కు కేంద్రం త‌ల‌వంచాల్సి వ‌చ్చింది. 

ఈ క్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. 

విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్‌గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్‌దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. 

అయితే ఇటీవలే గంభీర్ హెడ్‌కోచ్‌గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. 

అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్‌తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్‌కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్‌ మీడియాలో ఫన్నీ ట్రోల్స్‌ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement