‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ | Fans Troll After-Vaibhav Compared With-Shahid Afridi By-Ex-Pak Cricketer | Sakshi
Sakshi News home page

‘అఫ్రిదితో పోలిక.. ఇది వైభవ్‌ను అవమానించడమే!’

May 29 2026 1:51 PM | Updated on May 29 2026 2:11 PM

Fans Troll After-Vaibhav Compared With-Shahid Afridi By-Ex-Pak Cricketer

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆటను, అతడి ప్రదర్శనను క్రీడా నిపుణులు, అభిమానులు క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్‌, సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ మాత్రం వైభవ్‌ను మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌  షాహిద్ అఫ్రిదితో పోల్చడం వివాదాస్పదంగా మారింది.

‘15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే నాకు మా షాహిద్ అఫ్రిది గుర్తుకు వస్తున్నాడు. అతడు కూడా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగులు రాబట్టేవాడు. 1996 వన్డే ప్రపంచకప్‌లో 37 బంతుల్లోనే అఫ్రిది సెంచరీ బాదాడు. అప్పుడు అఫ్రిది వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. 

ఇప్పుడు వైభవ్ కూడా బౌలర్లు ఎంతవారైనా భయం, బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించడంలో విజయవంతమయ్యాడు. ఇక వైభవ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల వయసులో విధ్వంసకర బ్యాటింగ్ ఆడడం అతడి అదృష్టమని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నప్పుడు వయసుతో పని లేకుండా సీనియర్ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది. 

అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాల్సిందే.’ అని డిమాండ్ చేశాడు.  అయితే వైభవ్ బ్యాటింగ్‌ను మెచ్చుకోవడం నుంచి టీమిండియాలోకి అతడిని తీసుకోవాలని మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతృప్తి చెందిన అభిమానులు షాహిద్ అఫ్రిదితో వైభవ్‌ను పోల్చడంపై మాత్రం మండిపడ్డారు. వైభవ్‌తో అఫ్రిదిని పోల్చవద్దని హితవు పలికారు. 

‘భారత్ పట్ల ఎప్పుడు విద్వేష భావంతో ఉండే అఫ్రిదితో పోల్చడం ఏంటి? ఇది వైభవ్‌ను అవమానించడం కిందే లెక్క’.. ‘ఉగ్రవాదులతో కలిసి విందులో పాల్గొనే వ్యక్తితో పోలుస్తారా’ అంటూ కామెంట్లు చేశారు. కాగా పాక్ క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలో షాహిద్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ బలోచ్ నేత ఉజైర్ బలోచ్‌తో కలిసి డిన్నర్‌లో పాల్గొన్న ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఉగ్రవాదిగా ముద్ర పడిన వ్యక్తితో కలిసి అఫ్రిది భోజనం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్‌ను ద్వేషించే క్రికెటర్లలో అఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. పదే పదే భారత్‌ను కించపరిచేలా మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం అఫ్రిదికి అలవాటుగా మారిపోయిందని గతంలోనూ భారత క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పించారు.

ఐపీఎల్‌ 19వ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆడిన 15 మ్యాచ్‌ల్లో 242 స్ట్రైక్‌రేట్‌తో 680 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ, నాలుగు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ పోరులో 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసిన వైభ‌వ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్ర‌పంచ‌ రికార్డు సాధించే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. 

చదవండి: 'అత‌డు వేలంలోకి వ‌స్తే 30 కోట్లు చెల్లిస్తా!'

Advertisement
 
Advertisement
Advertisement