Fans Troll Rauf MCG Home Ground Comment Kohli Highlight 19th Over - Sakshi
Sakshi News home page

Virat Kohli: అప్పుడు మాటలు పేలావు! తట్టుకోలేరన్నావు! ఇప్పుడు తుస్సుమన్నావు! మ్యాచ్‌కే హైలైట్‌గా..

Published Mon, Oct 24 2022 3:10 PM | Last Updated on Tue, Oct 25 2022 5:46 PM

Fans Troll Rauf MCG Home Ground Comment Kohli Highlight 6 19th Over - Sakshi

T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న మెల్‌బోర్న్‌ పిచ్‌పై.. విరాట్‌ కోహ్లి ఆడిన కోహినూర్‌ వజ్రంలాంటి ఇన్నింగ్స్‌.. సగటు టీమిండియా అభిమాని మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్‌ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన తరుణంలో... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు.

మ్యాచ్‌కే హైలైట్‌ షాట్‌
ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హారిస్‌ రవూఫ్‌ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్‌ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్‌ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్‌ బాదాడు కోహ్లి. ఈ షాట్‌ మ్యాచ్‌లోనే హైలైట్‌. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్‌ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు.

భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి అశ్విన్‌ మిడాఫ్‌లో ఫీల్డర్‌ మీదుగా షాట్‌ ఆడి పరుగు తీయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తద్వారా గత ప్రపంచకప్‌లో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా బదులు తీర్చుకుంది.

నా హోం గ్రౌండ్‌ అన్నావు కదా!
ఈ అద్భుత విజయం నేపథ్యంలో... టీమిండియాతో మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎంసీజీ తన హోం గ్రౌండ్‌ లాంటిదన్న(బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న నేపథ్యంలో) రవూఫ్‌.... తన బెస్ట్‌ ఇచ్చానంటే భారత బ్యాటర్లు తట్టుకోవడం కష్టమేనంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఆదివారం నాటి(అక్టోబరు 23) మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్‌ చేసినప్పటికీ.. ఆఖరి ఓవర్లో కోహ్లి రెండు సిక్సర్లతో చెలరేగడం మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రవూఫ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మాటలు పేలావు.. తుస్సుమన్నావు
‘‘రవూఫ్‌ ఆనాడు ఏమన్నావో గుర్తుందా? చూశావా నీ హోం గ్రౌండ్‌లో.. నీ బౌలింగ్‌లో మా కింగ్‌ కోహ్లి వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌ను మా వైపు తిప్పేశాడు. థౌజండ్‌వాలా పేల్చేశాడు. మాటలు పేలిన నువ్వేమో తుస్సుమన్నావు!’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో రవూఫ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

చదవండి: No Ball Call: అంపైర్లపై అక్తర్‌ ట్వీట్‌.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది ‍కదా!
ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్‌
Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్‌పై ప్రశంసల జల్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement