
ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరం
క్యాచ్‌లు, రనౌట్లు అద్బుతం
భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వ్యాఖ్య
ధోని శకానికి (సారథిగా) ముందు భారత్ అంటే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ జట్టుగా పేరు గడించింది. దిగ్గజాలు సచిన్ మానియా, రాహుల్ ది వాల్, గంగూలీ శైలి అంతా బ్యాటింగ్ బలాన్ని, దీంతోనే జట్టు ఇమేజ్‌ను పెంచారు. 2007 మొట్టమొదటి టి20 ప్రపంచకప్‌తో ‘మహేంద్ర’జాలం మొదలయ్యాక టీమిండియా అంటే బ్యాటింగ్, బౌలింగే కాదు... ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ప్రాధాన్యమున్న జట్టుగా రూపాంతరం చెందింది. అటుపైనా అదే పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ జట్టుగా కొనసాగుతోంది.
అహ్మదాబాద్: సీనియరా... జూనియరా... కాదు! ఫిఫ్టీలు, సెంచరీలు చేయడమే ప్రధానం కాదు... ఫీల్డింగ్‌లో చురుగ్గా పది ఇరవై పరుగులు ఆపే ఆటగాళ్లు జట్టులో ఉండాలని ధోని నిక్కచ్చిగా సెలక్టర్లతో తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. తనకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకునేవాడు. ఆది జట్టుపై పెను ప్రభావమే చూపింది. ఒకప్పుడు ఫీల్డింగ్ కోచే లేని జట్టుకు తదనంతరం ఫీల్డింగ్ కోచ్ ప్రాధాన్యమేమిటో తెలిసొచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్ నైపుణ్యాన్ని మెచ్చిన మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా చేస్తే... గంభీర్ వచ్చాక తన సహాయ బృందంలో మార్పులెన్నో చేసినా... దిలీప్‌ను మాత్రం మార్చలేదు. ఎందుకంటే అతని ప్రతిభ ఏంటో తెలిసిన గంభీర్ తన శిక్షణ బృందంలో కొనసాగిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో ఇటీవలే ముగిసిన టి20, వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లలో జట్టు ప్రదర్శనపై దిలీప్ సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు మైదానంలో కదిలిన తీరు, చురుకైన జోరు అద్భుతమని కితాబిచ్చాడు. పలు అంశాలపై దిలీప్ ఏమన్నాడో అతని మాటల్లోనే...
అన్నింటా మెరుగే
ఈ సిరీస్‌లలో భారత క్రికెటర్లు మైదానంలో ప్రత్యేకించి ఫీల్డింగ్‌లో పోషించిన పాత్ర అద్భుతం. ప్రత్యర్థి బ్యాటర్ల పరుగుల్ని నిరోధించడంలో, కీలకమైన క్యాచ్‌ల్ని అందుకోవడంలో, రనౌట్లు చేయడంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు. మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి పుంజుకోకుండా ఎన్నో అవకాశాల్ని సృష్టించుకొని పట్టు సాధించిన తీరు బాగుంది. కీలకమైన దశల్లో ఆటగాళ్లు స్పందించిన విధానం మనమెంతో మెరుగని చాటింది.
అలసట, అలసత్వం లేనేలేదు
సిరీస్ ఆసాంతం ఆటగాళ్లు ఎంతో శ్రమించారు. అలసట ఎరుగని ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయినా... అలసత్వాన్ని దరిచేరనీయకుండా క్రమంగా తమ పట్టు పెంచారే తప్ప ఎక్కడా కోల్పోలేదు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా మెలిగారు. ఎక్కడా తగ్గలేదు. తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. అందుకే రెండు సిరీస్‌లను ఆఖరుదాకా లాక్కు రాకుండా ఓ మ్యాచ్ ఉండగానే గెలిచారు. వన్డేల్లో అయితే సులువుగా క్లీన్‌స్వీప్ చేశారు.
అందరూ హీరోలే
ఈ రెండు సిరీస్‌ల ప్రదర్శనను గమనించిన నాకు... ఇందులో ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వలేమని తెలిసొచ్చింది. ఫలాన ఆటగాడు మెరుగు, ఫలాన ఆటగాడు తక్కవ అని వేలెత్తి చూపలేం. ఫీల్డింగ్‌లో అయితే అందరు హీరోలే! కొత్త సీమర్ హర్షిత్ రాణా నుంచి అనుభవజ్ఞులైన శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వరకు అంతా బాగా ఆడారు. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ప్రతి ఒక్కరు పది పైచిలుకు పరుగుల్ని నిరోధించారనిపించింది. ఇంపాక్ట్ ఫీల్డర్ అంటూ ఉంటే మాత్రం శ్రేయస్ అయ్యరే! బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అతని ఆటతీరు అసాధారణంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment