నేడు ఆసియా చాంపియన్
ఖతర్‌తో కీలకపోరు
గెలిస్తే నేరుగా మూడో రౌండ్‌కు అర్హత
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment