గంభీర్- ధోని (PC: Star Sports/CSK)
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు.
టీమిండియా కెప్టెన్‌గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు మెంటార్‌గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్‌కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు.
ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు.
స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్‌గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం.
మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్‌లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు.
కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్‌కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్‌కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా!
Comments
Please login to add a commentAdd a comment