![Gary Kirsten Likely To Quit As Pakistan White Ball Coach](/styles/webp/s3/article_images/2024/10/28/c.jpg.webp?itok=vsMsPeqX)
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు హెడ్ కోచ్ పదవి(పరిమిత ఓవర్లు) నుంచి గ్యారీ కిర్‌స్టన్ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
త్వరలో పాక్ పరిమిత ఓవర్ల జట్లు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుండగా.. కిర్‌స్టన్ జట్లతో పాటు ఆయా దేశాలకు వెళ్లడం లేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు కారణమని సమాచారం. మరోవైపు కిర్‌స్టన్ పాక్ హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డును కోరగా, అందుకు పీసీబీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ వైదొలగడానికి ఇదీ ఒక కారణమని సమాచారం.
కిర్‌స్టన్ పాక్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఎంపికై కేవలం నాలుగు నెలలే అవుతుంది. ఈ లోపే అతనికి బోర్డుకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరో నాలుగు నెలల్లో పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ లోపు కిర్‌స్టన్ నిజంగా హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అది పాక్ జట్టుకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఒకవేళ కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అతని స్థానాన్ని టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్సీ లేదా జతీయ సెలెక్టర్ ఆకిబ్ జావిద్ భర్తీ చేసే అవకాశం ఉంది.
కాగా, త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాక్ జట్లను నిన్న ప్రకటించారు. పాక్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించింది. పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబార్ ఆజమ్ ఇటీవలే తప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment