
Gautam Gambhir Comments on Rahul Dravid And Rohit Sharma: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ టోర్నీల్లో తమ అదృష్టాన్ని మార్చుకోగలదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీను టీమిండియా సొంతం చేసుకుంది. ఆ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా కైవసం చేసుకోలేకపోయింది. 2014 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, కొత్తగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టోర్నీ-2021 ఫైనల్‌లోనూ భారత్ ఓడిపోయింది.
అదే విధంగా... 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో భారత్ నిష్క్రమించింది. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీను కూడా సొంతం చేసుకులేకపోయింది. దీంతో విరాట్ కోహ్లిపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్‌లలో భారత్‌ను తిరిగి విజయపథంలోకి తీసుకురావడానికి రోహిత్- ద్రవిడ్ ద్వయం ఇంగ్లండ్ విధి విధానాలను అనుసరించగలదని గంభీర్ చెప్పాడు.
"రోహిత్ శర్మ , రాహుల్ ద్రవిడ్ టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును విజయపథంలో నడిపిస్తారని, ఇంగ్లండ్ విధి విధానాలను అనుసరించి అతి త్వరలో ఐసీసి ట్రోఫీని గెలుస్తారని నేను ఆశిస్తున్నాను" అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికైన సంగతి తెలిసిందే. 2017 నుంచి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత తన భాధ్యతలనుంచి తప్పకోనున్నాడు.
అదే విధంగా విరాట్ కోహ్లి కూడా టీ20 ప్రపంచ్‌కప్ ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించనున్నారనే వార్తలు వినిసిస్తున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానం లీగ్ దశలోనే ముగిసిపోయింది. నవంబర్ 7న జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో... నవంబరు 8న భారత్ , నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.