
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ డ్రా వెలువడిన నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యుర్ధులైన భారత్, పాక్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అయితే దాయాదుల మధ్య జరిగే ఈ పోరులో గెలుపు బాధ్యతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలే తీసుకోవాలని గంభీర్ వ్యాఖ్యానించారు. పాక్‌తో పోరంటే ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం సహజమని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా సీనియర్లైన కోహ్లీ, రోహిత్ శర్మలు బాధ్యతగా ఆడాలని సూచించాడు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగిన తాను ఒత్తిడికిలోనైనట్లు చెప్పుకొచ్చాడు. రాబోయే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నాలాగే కొత్త కుర్రాళ్లు కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదమున్నందున సీనియర్లు కోహ్లీ, రోహిత్‌లు జాగ్రత్తగా ఆడాలని, గెలుపు బాధ్యతను వారి భుజాలపైనే వేసుకోవాలని పేర్కొన్నాడు. ఓ ప్రముఖ ఛానెల్‌లో జరిగిన స్పెషల్ షోలో గంభీర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే షోలో పాల్గొన్న భారత్ వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరని పేర్కొన్నాడు. దాయాదుల పోరంటేనే భావోద్వేగాల సమ్మేళనమని, ఇరు జట్లపై గెలుపు అంచనాలు సమానంగా ఉంటాయని వెల్లడించాడు.
ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తుందని, మాజీ క్రికెటర్లు సైతం పాక్‌తో మ్యాచ్ అంటే ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నాడు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ 2021 జరుగనుంది. దీనికి సంబంధించిన డ్రాను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-1లో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు రెండు క్వాలిఫయర్స్ జట్లు పోటీపడనుండగా, గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌తో పాటు మరో రెండు క్వాలిఫయర్స్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment