![Glen Maxwell Becomes Most runs conceded in an over in T20Is for Australia - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/29/glen.jpg.webp?itok=x0CyvKgc)
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆసీస్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మాక్సీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో మాక్స్‌వెల్ విరుచుకుపడ్డాడు.
ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మాక్సీ బౌండరీల వర్షం కురిపించి జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 48 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 104 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
మాక్సీ అత్యంత చెత్త రికార్డు..
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన మాక్స్‌వెల్.. బౌలింగ్‌లో మాత్రం అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మాక్స్‌వెల్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన ఆస్ట్రేలియా బౌలర్‌గా మాక్స్‌వెల్ నిలిచాడు.
ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ పేరిట ఉండేది. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో బ్రెట్‌లీ ఒకే ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బ్రెట్‌లీ చెత్త రికార్డును మాక్స్‌వెల్ తన పేరిట లిఖించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment