2020లో ఐపీఎల్‌ టాప్‌, ఎలాగంటే.. | Google Trends 2020: Indians Searched About IPL Than Covid 19 | Sakshi
Sakshi News home page

2020లో ఐపీఎల్‌ టాప్‌, ఎలాగంటే..

Published Mon, Dec 21 2020 2:23 PM | Last Updated on Mon, Dec 21 2020 2:40 PM

Google Trends 2020: Indians Searched About IPL Than Covid 19 - Sakshi

సాక్షి, అమరావతి : మన దేశంలో కోవిడ్‌ మహమ్మారిపైనా క్రికెట్‌ ఆధిపత్యం సాధించింది. కోవిడ్‌ వైరస్‌ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్‌లో అత్యధిక శాతం మంది క్రికెట్‌పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన అంశంగా ఐపీఎల్‌ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్‌ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్‌ యోజన, బిహార్‌ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ మంది వెతికిన అంశాల జాబితాను గూగుల్‌ ఇటీవల విడుదల చేసింది. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా ఐపీఎల్‌ క్రికెట్‌ గురించి సెర్చ్‌ చేయగా, మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఏపీలో ఈ అంశంపై విశాఖపట్నం, భీమవరం, చిత్తూరు నుంచి అత్యధికంగా.. నంద్యాల, అనంతపురంలో అతి తక్కువగా శోధించారు. 

కరోనాపై హిందూపూర్, చిత్తూరులో ఎక్కువ ఆసక్తి 
కరోనా వైరస్‌ గురించి గోవా, జమ్మూ–కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో 90 శాతం మంది సెర్చ్‌ చేయగా, మన రాష్ట్రంలో 42 శాతం, తెలంగాణలో 54 శాతం సెర్చ్‌ చేశారు. మన రాష్ట్రంలో ఈ అంశాన్ని హిందూపూర్, శ్రీకాకుళం, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది సెర్చ్‌ చేయగా.. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది సెర్చ్‌ చేయడం గమనార్హం. కేరళలో అతి తక్కువగా 30 శాతం మంది మాత్రమే దీని గురించి వెతికారు. 
(చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..)

మన చూపంతా అమెరికా ఎన్నికలపైనే 
అమెరికా ఎన్నికల గురించి మన రాష్ట్రంలో 38 శాతం మంది, తెలంగాణలో 42 శాతం మంది సెర్చ్‌ చేయడం విశేషం. ఐపీఎల్, కరోనా అంశాల సెర్చింగ్‌లో 20వ స్థానంలో ఉన్న ఏపీ ఈ అంశంలో నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఆశ్చర్యకరంగా పీఎం కిసాన్‌ యోజన ఈ సంవత్సరం టాప్‌ సెర్చింగ్‌ జాబితాలో ఉంది. దీన్ని బట్టి రైతుల అంశం ప్రజల్లో విస్తృతంగా నానుతున్నట్లు స్పష్టమైంది. ప్రముఖ వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, టీవీ జర్నలిస్టు అర్నాబ్‌ గోస్వామి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమితాబ్, కమలా హారిస్‌ గురించిన సమాచారం కోసం ఎక్కువ మంది వెతికారు.

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన దిల్‌ బేచారాను ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. తమిళ సినిమా సూరారై పొట్రు, బాలీవుడ్‌ సినిమాలు తన్‌హజి, శకుంతలాదేవి గురించి ఆ తర్వాత అన్వేషించారు. టీవీ, వెబ్‌ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైం డ్రామా మనీ హీస్ట్‌ గురించి ఎక్కువ మంది అన్వేషించారు. స్కామ్‌స్టర్‌ హర్షద్‌ మెహతా స్టోరీ, హిందీ బిగ్‌బాస్‌–14 గురించి ఆ తర్వాత ఎక్కువగా వెతికారు. 
(చదవండి: ఒలింపిక్స్‌కు మళ్లీ ఎంత కష్టమొచ్చే..!)

తాజా పరిణామాలపై ఇలా.. 
వార్తలకు సంబంధించి నిర్భయ కేసు, లాక్‌డౌన్స్, ఇండియా–చైనా సరిహద్దు పరిణామాలు, మిడతల దండు, రామ మందిరం సమాచారం కోసం ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంలో ఇళ్లల్లోనే ఉండిపోయిన జనం పన్నీర్‌ ఎలా తయారు చేయాలనే దానిపై గూగుల్‌లో ఎక్కువగా వెతికారు. ఆ తర్వాత ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, పాన్‌–ఆధార్‌కార్డు ఎలా లింక్‌ చేసుకోవాలి, ఇంట్లోనే శానిటైజర్‌ ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి అన్వేషించారు. 

కరోనా వైరస్‌ అంటే ఏమిటి (వాట్‌ ఈజ్‌) అనే దాని గురించి అత్యధిక మంది సెర్చ్‌ చేశారు. అలాగే సోషల్‌ మీడియా ట్రెండ్‌ అయిన బినాడ్‌ గురించి, ప్లాస్మా థెరపీ గురించి వెతికారు. స్థానికంగా తమ ఇళ్లకు ఏవి దగ్గరగా ఉన్నాయో తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో అన్వేషించారు. దగ్గరలోని ఫుడ్‌ షెల్టర్స్‌ గురించి అత్యధికులు అన్వేషించారు. దగ్గరలో కోవిడ్‌ టెస్ట్, మద్యం షాపు గురించి జనం వెతికారు. 

క్రికెట్‌పైనా జనం ఆసక్తి
మన దేశంలో క్రికెట్‌కు సంబంధించిన అంశాలపైనే జనం ఆసక్తి చూపుతారు. ఏ సంవత్సరమైనా క్రికెట్‌పైనే మన వాళ్లకు ఆసక్తి ఎక్కువ అని ఈ ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది. విద్యా సంబంధిత అంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, రాజకీయ అంశాలు, ఎన్నికల గురించి తెలుసుకునేందుకు కూడా మన రాష్ట్ర ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. 
– శ్రీ తిరుమల, డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణుడు, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement