GT Vs CSK: You Need To Be Proper Devil To Hate Dhoni, Says Hardik Pandya - Sakshi
Sakshi News home page

#MS Dhoni: ధోనిని ద్వేషించడానికి కారణాలుంటాయా?.. నా దృష్టిలో తను: హార్దిక్‌ పాండ్యా

Published Tue, May 23 2023 11:39 AM | Last Updated on Tue, May 23 2023 12:27 PM

GT Vs CSK Hardik Pandya: You Need To Be Proper Devil To Hate Dhoni - Sakshi

ధోనికి వీరాభిమానిని అన్న హార్దిక్‌ పాండ్యా

IPL 2023 GT Vs CSK- MS Dhoni- Hardik Pandya: ‘‘చాలా మంది మహీ సీరియస్‌గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు అనుకుంటారు. నేనైతే తనతో కలిసి జోకులు వేస్తా. తనను మహేంద్ర సింగ్‌ ధోనిలా అస్సలు చూడను. నాకు ఆయన ప్రియమైన అన్న. మంచి స్నేహితుడు.

ఆయనపై ప్రాంక్స్‌ చేస్తా. చిల్‌ అవుతా. నేను ఎల్లప్పుడూ మహేంద్ర సింగ్‌ ధోనికి పెద్ద అభిమానినే. ఆయనను ద్వేషించడానికి అసలు కారణాలంటూ ఏమీ ఉండవు’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌, టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు.

భారత మాజీ సారథి, సీఎస్‌కే నాయకుడు ధోనితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్‌-2023 తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. చెపాక్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్‌ జరుగనుంది.

ఫైనల్‌ బెర్తు ఖరారు చేసే మ్యాచ్‌
ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అయితే, ఏ రిస్క్‌ లేకుండా తుది మెట్టుకు చేరాలంటే గెలుపు తప్పనిసరైన పరిస్థితుల్లో గుజరాత్‌- చెన్నై జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. 

ఇదిలా ఉంటే.. సీఎస్‌కే కెప్టెన్‌, తలా ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. ‘‘కెప్టెన్‌.. లీడర్‌.. లెజెండ్‌.. ఎంఎస్‌ ధోని అంటేనే ఓ ఎమోషన్‌’’ అంటూ గుజరాత్‌ టైటాన్స్‌ షేర్‌ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

నా పెద్దన్న
తలాకు హార్దిక్‌ పాండ్యా తరఫున ట్రిబ్యూట్‌ అంటూ క్యాప్షన్‌ జత చేసిన ఈ వీడియోలో గుజరాత్‌ సారథి మాట్లాడుతూ.. ‘‘ధోని నాకు పెద్దన్న లాంటి వాడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో ఎలా ఉండాలో ధోని చూసి అర్థం చేసుకోవచ్చు. 

తనతో ఎక్కువగా మాట్లాడకపోయినా సరే.. మైదానంలో తన చర్యలను గమనిస్తే చాలు పాజిటివ్‌గా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. నాకు ఆయన మహేంద్ర సింగ్‌ ధోని కాదు.. మంచి స్నేహితుడు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియాలో ఉన్నపుడు ధోనితో కలిసి ఆడిన పాండ్యాకు ధోనితో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇదిలా ఉంటే.. తాను గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన సమయంలోనూ ధోని తనకు రోల్‌మోడల్‌ అని పాండ్యా చెప్పిన విషయం తెలిసిందే. ధోని అడుగుజాడల్లో నడుస్తూ మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకుంటానని పేర్కొన్నాడు. అన్నట్లుగా.. సారథిగా అరంగేట్రంలోనే ట్రోఫీ సాధించి సత్తా చాటాడు.

చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్‌మన్‌ సోదరికి అండగా..
నేను ఫామ్‌లో ఉన్నా! మా వాళ్లు తోపులు! చెన్నైతో మ్యాచ్‌కు ముందు గిల్‌ వార్నింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement