IPL 2023, PBKS Vs GT: హాఫ్‌ సెంచరీతో చెలరేగిన గిల్‌.. పోరాడి ఓడిన పంజాబ్‌ | Gujarat Titans Beat Punjab Kings By 6 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2023: హాఫ్‌ సెంచరీతో చెలరేగిన గిల్‌.. పోరాడి ఓడిన పంజాబ్‌

Apr 14 2023 3:08 AM | Updated on Apr 14 2023 8:38 AM

 Gujarat Titans beat Punjab Kings by 6 wickets - Sakshi

మొహాలి: డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐపీఎల్‌ టోర్నీలో తమ ఖాతాలో మూడో విజయాన్ని జమ చేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు సాధించింది.

పంజాబ్‌ జట్టులో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. నిలదొక్కుకుంటున్న దశలో పెవిలియన్‌ చేరుకున్నారు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన మాథ్యూ షార్ట్‌ (24 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్‌ శర్మ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు), స్యామ్‌ కరన్‌ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌), షారుఖ్‌ ఖాన్‌ (9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రాజపక్స (26 బంతుల్లో 20; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు.

గుజరాత్‌ పేస్‌ బౌలర్, 2020 తర్వాత మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మోహిత్‌ శర్మ 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), గిల్‌ ధాటిగా ఆడటంతో గుజరాత్‌ పవర్‌ప్లేలో 56 పరుగులు సాధించింది.

అనంతరం సాయి సుదర్శన్, హార్దిక్‌ పాండ్యా తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... మరోవైపు శుబ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినపుడల్లా బంతిని బౌండరీ దాటించిన గిల్‌ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్‌ మిల్లర్‌ (18 బంతుల్లో 17 నాటౌట్‌; 1 ఫోర్‌)తో కలిసి నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి.

స్యామ్‌ కరన్‌ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి మిల్లర్‌ సింగిల్‌ తీయగా... రెండో బంతికి గిల్‌ బౌల్డయ్యాడు. తెవాటియా క్రీజులోకి వచ్చి సింగిల్‌ తీశాడు. నాలుగో బంతికి మిల్లర్‌ కూడా సింగిల్‌ తీశాడు. దాంతో గుజరాత్‌ విజయానికి చివరి 2 బంతుల్లో 4 పరుగులు కావల్సి రావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో బంతికి రాహుల్‌ తెవాటియా (2 బంతుల్లో 5 నాటౌట్‌; 1 ఫోర్‌) స్కూప్‌ షాట్‌తో బంతిని బౌండరీకి తరలించడంతో గుజరాత్‌ విజయం ఖరారైంది.  

అంతకుముందు పంజాబ్‌ జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ ఖాతా తెరవకుండానే షమీ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కెపె్టన్‌ శిఖర్‌ ధావన్‌ (8 బంతుల్లో 8; 2 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టినా భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న షార్ట్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేయడంతో పంజాబ్‌ ఇబ్బందుల్లో పడింది. చివర్లో షారుఖ్‌ ధాటిగా ఆడటంతో పంజాబ్‌ స్కోరు 150 దాటింది.  

స్కోరు వివరాలు 
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) షమీ 0; శిఖర్‌ ధావన్‌ (సి) జోసెఫ్‌ (బి) లిటిల్‌ 8; మాథ్యూ షార్ట్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 36; రాజపక్స (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 20; జితేశ్‌ శర్మ (సి) సాహా (బి) మోహిత్‌ శర్మ 25; స్యామ్‌ కరన్‌ (సి) గిల్‌ (బి) మోహిత్‌ శర్మ 22; షారుఖ్‌ ఖాన్‌ (రనౌట్‌) 22; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 8; రిషి ధావన్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–55, 4–92, 5–115, 6–136, 7–152, 8–153. బౌలింగ్‌: షమీ 4–0–44–1, జోష్‌ లిటిల్‌ 4–0–31–1, అల్జారి జోసెఫ్‌ 4–0–32–1, రషీద్‌ ఖాన్‌ 4–0–26–1, మోహిత్‌ శర్మ 4–0–18–2. 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) షార్ట్‌ (బి) రబడ 30; గిల్‌ (బి) స్యామ్‌ కరన్‌ 67; సాయి సుదర్శన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (బి) అర్‌‡్షదీప్‌ 19; హార్దిక్‌ పాండ్యా (సి) స్యామ్‌ కరన్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 8; డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 17; రాహుల్‌ తెవాటియా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–48, 2–89, 3–106, 4–148. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–33–1, రబడ 4–0–36–1, హర్‌ప్రీత్‌ 4–0–20–1, స్యామ్‌ కరన్‌ 3.5–0–25–1, రాహుల్‌ చహర్‌ 3–0–24–0, మాథ్యూ షార్ట్‌ 1–0–8–0.  

ఐపీఎల్‌లో నేడు 
కోల్‌కతా vs హైదరాబాద్‌ (రాత్రి గం. 7:30 నుంచి) 
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement