ఐపీఎల్‌-2025 ప్రారంభానికి ముందు గుజరాత్‌ కెప్టెన్‌ గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Gujarat Titans Captain Shubman Gill Comments Before Start Of IPL 2025 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2025 ప్రారంభానికి ముందు గుజరాత్‌ కెప్టెన్‌ గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Mar 20 2025 11:06 AM | Last Updated on Thu, Mar 20 2025 11:09 AM

Gujarat Titans Captain Shubman Gill Comments Before Start Of IPL 2025

ఐపీఎల్‌-2025 ప్రారంభానికి ముందు గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్‌ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని  అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 18వ సీజన్‌లో గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్‌గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.

2023 సీజన్‌లో టైటాన్స్‌ తరఫున హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్‌ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్‌ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్‌రేట్‌ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. 

అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, విక్రమ్‌ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. 

గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్‌లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్‌ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్‌లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు.    

కాగా, ఈ సీజన్‌లో గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో (మార్చి 25) పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన గుజరాత్‌.. ఈ సీజన్‌లో కొత్తగా కనిపిస్తుంది. జోస్‌ బట్లర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగం ‍ప్రమాదకరంగా కనిపిస్తుంది. 

శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్‌ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్‌ బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ, గెరాల్డ్‌ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళ​‍కళలాడుతుంది. 

ప్రపంచ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్‌ సుందర్‌ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, రాహుల్‌ తెవాతియా, షారుఖ్‌ ఖాన్‌, మహిపాల్‌ లోమ్రార్‌ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.

గుజరాత్‌ టైటాన్స్‌
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రాహుల్‌ తెవాతియా, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, రషీద్‌ ఖాన్‌, మహిపాల్‌ లోమ్రార్‌, రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, షారుఖ్ ఖాన్‌,  నిషాంత్‌ సింధు, అర్షద్‌ ఖాన్‌, కరీమ్‌ జనత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జయంత్‌ యాదవ్‌, జోస్‌ బట్లర్‌, కుమార్‌ కుషాగ్రా, అనూజ్‌ రావత్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, ఇషాంత్‌ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్‌ కేజ్రోలియా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement