థామస్ కప్... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఒకటి.. టీమ్ ఈవెంట్‌గా ఈ మెగా టోర్నీకి ఉన్న ప్రత్యేకతే వేరు! 1949 నుంచి 2020 వరకు 31 సార్లు టోర్నమెంట్ జరిగితే భారత జట్టు కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కేవలం ఐదు దేశాలు చైనా, ఇండోనేసియా, మలేసియా, జపాన్, డెన్మార్క్ మాత్రమే వాటిని అందుకోగలిగాయి.
కానీ ఏడాది క్రితం భారత జట్టు ఈ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ తొలిసారి విజేతగా నిలిచింది. ఈ ఘనతలో అందరికంటే కీలక పాత్ర పోషించిన షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్.. సరిగ్గా చెప్పాలంటే అతను లేకపోతే ఈ టోర్నీలో విజయమే లేదు! సుదీర్ఘ కాలంగా ఎన్నో సంచలన ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రణయ్ ఇప్పుడు మరిన్ని పెద్ద విజయాలపై దృష్టిసారించాడు.
మాజీ చాంపియన్ మలేసియాతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.. బలాబలాలు చూస్తే భారత్‌దే పైచేయిగా అనిపించింది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో లెక్క మారిపోయింది. మూడు వరుస విజయాలు సరిపోతాయి అనుకుంటే రెండో డబుల్స్‌లో కూడా ఓటమి ఎదురైంది. దాంతో స్కోరు 2–2 వద్ద నిలిచింది.
ఈ స్థితిలో చివరి సింగిల్స్‌లో ప్రణయ్ బరిలోకి దిగాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్‌లలో మ్యాచ్‌ను ముగించాడు. దాంతో జట్టు సెమీస్‌కి చేరింది. సెమీ ఫైనల్లో మరో మాజీ ప్రత్యర్థి డెన్మార్క్ ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి. లక్ష్య సేన్‌తో పాటు పురుషుల రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఓటమి. స్కోరు 2–2తో సమం. మరోసారి ప్రణయ్‌పైనే భారం.. అతను ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు.
కానీ తొలిగేమ్‌లోనే షాక్! రిటర్న్ షాట్ ఆడబోయి కోర్టులో ముందుకు పడిపోవడంతో చీలమండలానికి తీవ్ర గాయం. తట్టుకోలేనంత నొప్పి. తొలి గేమ్ కోల్పోయాడు కూడా. ఇక తప్పుకోవడమే మిగిలింది. భారత్‌కు ఓటమి ఖాయమనిపించింది. కానీ ప్రణయ్ ఒప్పుకోలేదు. చివరి వరకు పోరాడేందుకు సిద్ధమయ్యాడు. కొంత బ్రేక్ తీసుకొని పెయిన్ కిల్లర్లతో ఆటకు సై అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం తీవ్రమవుతుందా లేక ఇంకా పెద్ద సమస్యగా మారుతుందా అనేది ఆలోచించలేదు. ఎదురుగా టీమ్ గ్యాలరీలో తనపై ఆశలు పెట్టుకున్న సహచరులు కనిపిస్తుండగా బరిలోకి దిగాడు.
తన శక్తియుక్తులను పూర్తిగా కేంద్రీకరించి ప్రత్యర్థిపై చెలరేగాడు. ఫలితంగా తర్వాతి రెండు గేమ్‌లలో విజయం! టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్‌కి చేరింది. ప్రణయ్ సాగించిన ఈ సమరం బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో ఫైనల్ మ్యాచ్. ఇక ఈసారి తన వరకు వస్తే మళ్లీ అంతే పట్టుదల కనబరచాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇతర భారత షట్లర్లు అలాంటి పరిస్థితి రానీయలేదు. అందరూ సత్తా చాటి 3–0తో మ్యాచ్‌ని ముగించి టీమ్‌ని చాంపియన్‌గా నిలిపారు.
తండ్రి ప్రోత్సాహంతో..
తల్లిదండ్రుల పేర్లు హసీనా .. సునీల్ (హెచ్‌ఎస్) కలగలిపి ప్రణయ్ తన పేరుకు ముందు చేర్చుకున్నాడు. అతని స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. తండ్రి సునీల్‌కి బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేసిన ఆయన తన టీమ్‌కి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. అదే ప్రణయ్‌నీ ఆట వైపు మళ్లించింది.
తండ్రి వద్దే అతను ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే మొదట్లో జూనియర్ స్థాయిలో ఆశించిన విధంగా ప్రణయ్ కెరీర్ సాగలేదు. చురుకుదనం ఎక్కువగా లేదంటూ అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దాంతో సింగిల్స్ నుంచి డబుల్స్‌కీ మారి చూశాడు. అయితే కేరళలో తగిన కోచింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడం అతనికి సమస్యగా మారింది.
అదే మలుపు..
ప్రణయ్ కెరీర్‌లో కీలక మలుపు 15 ఏళ్ల వయసులో వచ్చింది. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరడమే అతను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. అప్పటి వరకు అద్భుత విజయాలేమీ లేకున్నా ప్రణయ్‌లోని ప్రతిభను గోపీచంద్ గుర్తించాడు. అతనికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించి తన బృందంలో చేర్చకున్నాడు. అప్పటినుంచి అతని ఆట మారింది.
షాట్లలో పదును పెరిగింది. స్మాష్‌లు, ర్యాలీలు.. ఇలా అన్ని రకాలుగా అతను మెరుగయ్యాడు. ఇక ఫలితాలు రావడమే తరువాయి అనిపించింది. నిజంగానే ప్రణయ్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వరుస విజయాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అక్కడ మొదలు..
2010లో సింగపూర్‌లో యూత్ ఒలింపిక్స్ జరిగాయి. బాలుర బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతూ ప్రణయ్ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. అక్కడ ఓటమి ఎదురైనా రజత పతకం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నెల రోజులలోపే మెక్సికోలో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ అతనికి దక్కిన మరో మంచి అవకాశం. బాలుర సింగిల్స్‌లో ఇక్కడా కాంస్యం గెలవడంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అతనికి కొంత గుర్తింపు దక్కింది. 2014లో ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలవడంతో జాతీయ స్థాయిలో అతను అగ్రశ్రేణి ఆటగాడయ్యాడు.
చాలెంజర్ టోర్నీలతో మొదలై..
కెరీర్‌లో సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ విజయాలు సాధించాల్సిన మలుపు వద్ద ప్రణయ్ నిలిచాడు. 22 ఏళ్ల వయసులో టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ గెలవడంతో అతని ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చాలెంజర్ టోర్నీ చేరింది. తర్వాత ఇదే తరహాలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్‌లోనూ అతను రన్నరప్‌గా నిలిచాడు.
అనంతరం మూడు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌ప్రి టోర్నీలు ఇండోనేసియన్ మాస్టర్స్, స్విస్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లను గెలుచుకొని ప్రణయ్ దూసుకుపోయాడు. శాఫ్ క్రీడల్లో రజతం, ఆసియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం వీటికి అదనం. అయితే ఒక్కసారిగా వచ్చిన అనూహ్య గాయాలు ప్రణయ్ కెరీర్‌ను దెబ్బ తీశాయి. అత్యుత్తమంగా ఆడుతున్న వేర్వేరు దశల్లో గాయాల కారణంగా అతని జోరుకు బ్రేక్ పడింది. ఒకసారి కోలుకొని మళ్లీ దారిలో పడే సమయానికి మరో గాయం అతడిని ఇబ్బంది పెట్టింది. దాంతో వరుస పరాజయాలు అతన్ని పోటీలో వెనక్కి తోశాయి.
బలమైన ప్రత్యర్థులపై..
ప్రణయ్ కెరీర్‌లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బలమైన ప్రత్యర్థులతో తలపడి వారిని చిత్తు చేశాడు. అతని జోరు ముందు తలవంచిన కొందరు స్టార్ ఆటగాళ్లలో ఆల్‌టైమ్ గ్రేట్ లిన్ డాన్, చెన్ లాంగ్, విక్టర్ అక్సెల్సన్, తౌఫీక్ హిదాయత్, టామీ సుగియార్తో, కెంటో మొమొటా, లీ చోంగ్‌వీ, కిడాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కానీ ఈ విజయాలు అతడిని చాలా సందర్భాల్లో టైటిల్ వరకు తీసుకుపోలేదు.
దాంతో ఈ ఫలితాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. అయితే పోరాటతత్వం, చివరి వరకు ఓటమిని అంగీకరించని శైలి అతను మళ్లీ కొత్తగా సిద్ధమయ్యేందుకు కావాల్సిన ప్రేరణను అందించాయి. మారిన ఆటతో దూసుకుపోతూ.. దాదాపు సంవత్సర క్రితం ప్రణయ్ కెరీర్ మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ ఇంకా ఏదో లోపం, మరింత సాధించాలనే తపన మాత్రం వదల్లేదు. అప్పుడు కోచ్ గోపీచంద్‌తో అతను చర్చించాడు.
ఇంకా ఎంతో ఎదిగే అవకాశం ఉన్నా ఎక్కడో లోపం ఉంటోందని తేలింది. దాంతో కొత్తగా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. గాయాల గేయాలు వినిపించకుండా ప్రత్యేక ట్రైనింగ్‌తో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకున్నాడు. ఆటలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్న చిన్న లోపాలను సరిదిద్దుకున్నాడు. కోర్టులో చురుకుదనం, స్మాష్‌లలో దూకుడు పెరిగింది. ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలైంది.
సర్క్యూట్‌లో బలమైన ఆటగాడిగా నిలబడ్డాడు. ఇందులో మొదటి ఫలితం థామస్ కప్ రూపంలో వచ్చింది. 2022లో ఈ మెగా టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ అతని ఖాతాలో చేరింది. ఈ ఏడాదైతే మలేసియా మాస్టర్స్ సూపర్ 500 కెరీర్‌లో ప్రణయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఇదే అతని కెరీర్‌లో అతి పెద్ద విజయం కావడం విశేషం. వారాల వ్యవధిలో ఇదే స్థాయి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గానూ నిలిచాడు.
వరల్డ్ ర్యాంకింగ్‌లో అత్యుత్తమంగా 7కు చేరుకున్నాడు. ఇప్పడు ప్రణయ్ భారత్ తరఫున నంబర్‌వన్. ఫామ్ పరంగా, ఆటపరంగా కూడా అత్యుత్తమ ఆటగాడు. దాంతో అతనిపై అన్ని వైపుల నుంచీ అంచనాలు పెరిగాయి. రాబోయే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలవడం మొదటి లక్ష్యం కాగా, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ పతకమే అతని అసలైన మజిలీ. ప్రణయ్ ఆటను చూస్తే ఈ రెండూ కూడా సాధ్యమే అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment