![Hardhik Pandya Likely To Replace Rohit Sharma As India ODI Captain- Report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/gill2.jpg.webp?itok=5DhGGDs9)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.
ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్‌తో వామాప్ మ్యాచ్ ఆడనుంది.
కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.
కెప్టెన్‌గా హార్దిక్..!
ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు.
అయితే గిల్‌ను వైస్ కెప్టెన్‌గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.
రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్‌రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.
రోహిత్ రిటైర్మెంట్..!
కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు.
ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్‌మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.
చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment