ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్‌లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.
కాగా, గత సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు.
ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment