ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది.
258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
ఈ ఏడాది సీజన్‌లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
"ఈ మ్యాచ్‌లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.
ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్‌ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment