పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రూక్ అధ్బుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 49 బంతుల్లో 102 పరుగులు చేసి బ్రూక్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఫఖర్ జమాన్, బ్రూక్ లహోర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు.
51 పరుగులు చేసిన జమాన్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్రూక్ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. బ్రూక్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫాహిమ్ ఆష్రఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లాహోర్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లాహోర్ బౌలర్లలో షాహీన్‌షా ఆఫ్రిది, రషీద్ ఖాన్, హరీష్ రఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment