టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
రీఎంట్రీలో రనౌట్
సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్‌తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.
ఇండోర్‌లో డకౌట్
మొహాలీ మ్యాచ్‌లో ఈ మేరకు.. శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్.. డకౌట్ అయ్యాడు.
తప్పుడు షాట్ సెలక్షన్
అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది.
సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్‌తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే.
ఆ రోహిత్ కావాలి
రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్‌లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్‌లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్‌లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
కాగా.. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment