కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్, యువ బ్యాటర్ రింకూ సింగ్ కష్టాల కడలిని దాటి క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కడు పేదరికంలో జన్మించిన అతడు.. ‘ఆట’తో ఆర్థికంగానూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే దిశగా దూసుకుపోతున్నాడు. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూ.. స్వీపర్‌గా పనిచేస్తూ కాలం వెళ్ల దీసే స్థాయి నుంచి ‘లక్షాధికారి’ అయ్యాడు.
ఆర్థిక పరిస్థితి మెరుగైనా..
తద్వారా.. తనలాంటి ఆశావహ క్రికెటర్లందెరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు. అయితే, తమ ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ తన తండ్రి మాత్రం ఇంకా కుటుంబం కోసం కష్టపడుతూనే ఉన్నారంటున్నాడు రింకూ సింగ్. కొడుకు సంపాదిస్తున్నా.. ఖాళీగా ఉండటం ఆయనకు నచ్చదంటున్నాడు. పనిచేయడంలోనే ఆయనకు సంతృప్తి దొరకుతుందని చెబుతున్నాడు.
కేకేఆర్ దృష్టిలో పడ్డ తర్వాత
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కేకేఆర్ రింకూను కొనుగోలు చేయడంతో అతడి దశ తిరిగింది. ఆరంభంలో ఆడే అవకాశాలు రాకున్నా ఓపికగా ఎదురుచూసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023 ఎడిషన్‌లో అదరగొట్టాడు. 14 ఇన్నింగ్స్‌లో 149.53 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా 474 పరుగులు సాధించాడు.
సిక్సర్ల రింకూగా..
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో తాజా సీజన్‌లో అద్బుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డ రింకూ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
నాన్న.. ఇంకా ఆ పని మానలేదు
ఈ నేపథ్యంలో త్వరలోనే రింకూ టీమిండియా ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వార్తా సంస్థ పీటీఐతో ముచ్చటించిన రింకూ సింగ్ తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాన్నను రిలాక్స్ అవ్వమని చెప్పాను. కానీ ఆయన ఇప్పటికి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పనిమానుకోలేదు.
ఆయనకు పని చేయడం ఇష్టం. ఒకవేళ ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుందని అంటారు. చిన్న వయసు నుంచే కష్టపడటం అలవాటైన వ్యక్తికి ఇప్పుడు అకస్మాత్తుగా ఊరికే కూర్చుకోమంటే కష్టమే కదా!’’ అని పేర్కొన్నాడు. కాగా 25 ఏళ్ల రింకూ కుటుంబ పోషణ కోసం తన తండ్రి, సోదరుడితో కలిసి ఎల్పీజీ గ్యాస్‌లు సరఫరా చేసేవాడు.
తొలుత ఐర్లాండ్ పర్యటనలో
స్వీపర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. క్రికెట్ కెరీర్‌ను కొనసాగించే క్రమంలో దానిని వదిలేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్‌కు ఐపీఎల్-2023 వేలం నేపథ్యంలో కేకేఆర్ 55 లక్షల రూపాయలు చెల్లించి అట్టిపెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు ‘సిక్సర్ల’ రింకూ. కాగా ఆగష్టు 18- 23 వరకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో రింకూ సభ్యుడన్న సంగతి తెలిసిందే.
చదవండి: సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి
Comments
Please login to add a commentAdd a comment